ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాకినాడ జిల్లాలోని ఏలేరు కాలువ పొంగింది. ఏలేరు కాలువకు భారీగా వరద నీరు చేరడమే ఇందుకు కారణం. దాదాపు 27వేల క్యూసెక్కుల నీటిని ఏలేరు రిజర్వాయర్ నుంచి విడుదల చేస్తున్నారు అధికారులు. ఏలేరు రిజర్వాయర్(Yeleru Reservoir)కు 47 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇటువంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని అధికారులు చెప్తున్నారు. ఈ వరద ప్రభావం 10 మండలాల పరిధిలో ఉన్న 86 గ్రామాలపై తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. 86 గ్రామాల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏలేశ్వరం, కిర్లంపూడి మండలాల్లో వేలాది ఎకరాల మంట నీట మునిగిపోయింది.
Yeleru Reservoir | ఏలేరు కాల్వకు పడిన గండి కారణంగా వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని అధికారులు చెప్తున్నారు. తమకున్న ప్రాథమిక సమాచారం మేరకు దాదాపు ఆరు గ్రామాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయని వివరించారు. ఈ వరద ముంచెత్తడంతో గ్రామాల నుంచి బయటకు వచ్చే మార్గం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు బిజీ అయిపోయారు. వరద బాధితులకు అన్ని నిత్యావసరాల ఏర్పాటు చేయడంపై దృష్టి సారించామని వారు చెప్తున్నారు. అక్కడి పరిస్థితిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. అధికారులను ఆరా తీశారు. అంతేకాకుండా బాధితులతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.