విజయవాడలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ముంపు ప్రాంతమైన అమరావతి కూడా నీట మునగనుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ వార్తలపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) స్పించారు. ఇటువంటి వార్తలను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దన్నారు. ఇవన్నీ కూడా కొన్ని పేటీఎం బ్యాచ్‌లు చేస్తున్న ఫేక్ ప్రచారమేనని, ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అమరావతిపై విషం చిమ్మడం ప్రస్తుతం వైసీపీ పరమావధిగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ ఈ రెండు రోజుల నుంచి వచ్చినంతటి వరదలను తాను ఎన్నడూ చూడలేదని, 1998, 2009 లో వచ్చిన వరదలు కూడా ఇంత ఉధృతిగా లేవని ఆయన అన్నారు.
‘‘అమరావతి(Amaravati) ముంపు ప్రాంతమనే జగన్ కలను సాగాకారం చేయడానికి కొందరు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పేటీఎం బృందాలు, బ్లూమిడియా కలిసి ఈ విషప్రచారాన్ని జోరుగా ముందుకుసాగిస్తున్నారు. 11.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినా అమరావతి చెక్కు చెదరలేదు. కాబట్టి ఇలాంటి నిరాధార ప్రచారాలు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఐదేళ్ల తమ పాలనలో వారు చూపిన నిర్లక్ష్యానికి ఈ వరదలు ప్రతిరూపం. ఐదేళ్ల కాలంలో వాళ్లు కృష్ణా కరకట్టపై మంతెన ఆశ్రమం దగ్గర ఉన్న షట్టర్‌కు కనీసం మెయింటనెన్స్ గ్రీజ్ కూడా పెట్టించలేదు. ఎక్కడా పూడికలు తీయలేదు. అవన్నీ ఎక్కడ బయటపడిపోతాయో అన్న భయంతో ప్రజల దృష్టిని అమరావతిపై మళ్లించడానికే ఇటువంటి విష ప్రచారాలు చేస్తోంది’’ అని ఆయన(Nimmala Ramanaidu) వ్యాఖ్యానించారు.