ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ అంతర్గత సమస్యలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను మడకశిరలోని గాంధీ బజార్ ప్రాంతంలో బంగారు దుకాణం యజమాని కృష్ణ చారి, అతని భార్య సరళ, వారి ఇద్దరు కుమారులుగా గుర్తించారు. ఆ కుటుంబం స్వర్ణకారులు అని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల తయారీలో ఉపయోగించే సైనైడ్ ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
కాగా, వీరి మృతదేహాలను మొదటగా చారి తండ్రి చూశారు. ఉదయం ఎవరూ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి లోపలికి చూడగా అందరూ శవాలుగా కనిపించారు. దీంతో షాకైన తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుల ఊబిలో కోరుకుపోవడంతోనే భార్యాకొడుకులతో సహా చారి ఆత్మహత్యకి పాల్పడ్డట్టు పోలీసులు చెబుతున్నారు.
Sathya Sai District | సోదాల సమయంలో పోలీసులు ఒక సైనైడ్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైనైడ్ సేవించి మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి కుటుంబం విషం సేవించి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మరిన్ని వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు. డేటాను రిట్రీవ్ చేయడానికి చారి విరిగిన మొబైల్ ఫోన్‌ను పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా అని ధృవీకరించడానికి, విషాదానికి కారణమైన అదనపు కారణాలను తెలుసుకోవడానికి వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది.