Gudlavalleru Engg College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజినీరింగ్ కళాశాలలో చెలరేగిన సీక్రెట్ కెమెరా వివాదం ఎట్టకేలకు సర్దుమణిగిపోయింది. ఈ ఘటనపై దృష్టిసారించిన ప్రభుత్వం.. దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఏ ఒక్కరినీ వదలకుండా తనిఖీలు చేయడం ప్రారంభించారు. దాంతో పాటుగా కళాశాల ఆవరణ మొత్తాన్ని సునిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీలు నాలుగు గంటలకుపైగా కొనసాగాయి. ఈ సోదాలను విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది సమక్షంలోనే నిర్వహించారు అధికారులు. హాస్టల్‌లోని ప్రతి అంగుళం తనిఖీ ఎటువంటి హిడెన్(సీక్రెట్) కెమెరా లభించలేదని వెల్లడించారు. దాంతో విద్యార్థునుల మనసు కుదుటపడింది. వారు వెంటనే ఆందోళనను విరమించారు. అనంతరం సోమవారం వరకు కళాశాలకు సెలవులు ప్రకటించి మరోమారు తనిఖీలు చేపడతామని అధికారులు తెలిపారు.
Gudlavalleru Engg College | సోమవారంలోపు సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రి కొల్లు రవీంద్ర.. పోలీసులను ఆదేశించారు. అంతేకాకుండా ఆందోళన చేసిన విద్యార్థినులపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దని సూచించారు. అదే విధంగా వారిపై కక్షసాధింపుకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయంటూ కళాశాల యజమాన్యాన్ని హెచ్చరించారు. ఆందోళన చేసిన విద్యార్థినుల పట్ల వేధింపులు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు. కాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసి అదే హాస్టల్‌లో ఉండటానికి విద్యార్థినులు అంగీకరించారు.