మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామయ్య జోగయ్య(Harirama Jogaiah) రాష్ట్ర ప్రజలకు మరో బహిరంగ లేఖ రాశారు. అయితే ఈసారి వైసీపీ ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఏ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ ‘రెడ్డి’, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్’రెడ్డి’, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా ‘రెడ్డి’, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం ‘రెడ్డి’, ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్ ‘రెడ్డి’, ముఖమంత్రి కార్యాలయం కార్యదర్శి ధనుంజయ ‘రెడ్డి’, వైసీపీ లోక్‌సభాపక్ష నాయకుడు మిథున్ ‘రెడ్డి’, రాజ్యసభాపక్ష నాయకుడు విజయసాయి ‘రెడ్డి’, ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా’రెడ్డి’, కాబోయే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ ‘రెడ్డి’, టీటీడీ ఈవో ధర్మా ‘రెడ్డి’.. ఆంధ్రప్రదేశ్‌లో “రెడ్ల” రాజ్యం జిందాబాద్ అంటూ లేఖలో పేర్కొన్నారు.
ఇటీవలే హరిరామ జోగయ్య(Harirama jogaiah) సీఎం జగన్‌కు లేఖ రాశారు. టీటీడీ ఛైర్మన్ పదవిని రాయలసీమ ప్రాంతంలో ఉండే బలిజలకు ఇవ్వాలని కోరారు. 22శాతం జనాభా ఉన్న వారికి ఈ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాపుల్ని వాడుకోవడం తప్ప.. గతంలోనూ ఏ ముఖ్యమంత్రి న్యాయం చేయలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అవకాశం ఉన్నా రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జగన్‌కు సూచించారు. కానీ ఈ లేఖను పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వం టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.
గతంలోనూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూ జోగయ్య బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతిపక్షాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో చేసే విమర్శలు చాలా హుందాగా ఉండేవని గుర్తుచేశారు. ఆయన హుందాతనంలో 10శాతం కూడా జగన్‌లో కనిపించడం లేదని విమర్శించారు. చట్ట ప్రకారం విడిపోయి విడాకులు తీసుకున్న వారు మరో వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని.. కానీ జగన్ పదే పదే పవన్ కల్యాణ్(Pawan Kalyan) పెళ్లిళ్ల గురించి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. పవన్‌ను విమర్శించడానికి మరో విషయం లేనందునే జగన్ అనవసర విమర్శలు చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు.