మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై(TDP Office) 2021లో వైసీపీ మూకలు చేసిన దాడిపై నమోదైన కేసులో పలు సెక్షన్లు చేర్చడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కేసులో ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 326(ప్రమాదకర ఆయుధాలతో తీవ్రంగా గాయపరచడం) చేర్చడం సరికాదని, వాటిని తొలగించాలంటూ హైకోర్టును కోరడం జరిగింది. కాగా తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ సెక్షన్లను చేర్చడాన్ని సమర్థించింది. ఘటనకు సంబంధించిన వాస్తవాలు ఎఫ్ఐఆర్‌లోనే ఉన్నాయని, అలాంటి పరిస్థితిలో 307, 326 సెక్షన్లు చేర్చకపోవడం అప్పటి ఐఓ అసమర్థతేనని ఆక్షేపించింది. అదే విధంగా కేసు ప్రాథమిక దశలో అప్పటి ఐఓ విస్మరించిన వివరాలను తర్వాత చేర్చడాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది.
TDP Office | ఈ సందర్భంగానే ఈ కేసులో 307, 326 సెక్షన్లను చేరుస్తూ నమోదు చేసిన మెమోను తిరస్కరించాలని కోరిన పిటిషనర్ల వాదనని న్యాయస్థానం తోసిపుచ్చింది. అదే విధంగా జూలై 3 నుంచి పిటిషనర్లు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారని, ఈ సమయంలో కేసులో పురోగతి కనిపిస్తోందని హైకోర్టు గుర్తుచేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిటిషనర్లకు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు అవరోధం కలగదని కూడా అభిప్రాయపడింది. అనంతరం వారికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. జస్టిస్ పీఆర్‌కే కృపాసాగర్ ఈ మేరకు తీర్పునిచ్చారు.