తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే గంటపాటు పడిన కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాన రాకతో తిరుమలగిరులు చల్లబడ్డారు. గాలివానకు కౌస్తుభం అతిథి గృహం వద్ద వృక్షం విరిగిపడింది. ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గురువారం కూడా తిరుమలలో భారీ వర్షం పడింది.
Tirumala | మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. సాధారణం కంటే అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండిపోతున్న ఎండల ధాటికి జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఎండలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.