ఏపీలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. . బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. . కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడవొచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది. ఇక ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది.
మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లాలో అయితే విభిన్నమైన వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రానికి భారీ వర్షం(Heavy Rains) కురసింది. దీంతో ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజలు వర్షానికి కాస్త సేదతీరారు. మరోవైపు తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిచింది.