Hero Vishal gives Clarity On his Political entry from Kuppam: హీరో విశాల్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. ఆయన ఎప్పటి నుండో వైసీపీ తరఫున చంద్రబాబు నాయుడు పై పోటీకి కుప్పం నుండి బరిలో దిగుతారంటూ ప్రచారం నడిచింది. ఎట్టకేలకు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు హీరో విశాల్. తాజాగా ఆయన నటించిన లాఠీ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటున్నారు విశాల్.
ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ పై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కుప్పం నుండి పోటీ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. కుప్పంలో తమకు చాలా వ్యాపారాలు ఉన్నాయని, ఆ ప్రాంతంలో తనకు అనువణువు తెలుసు అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ అంటే ఇష్టమే కానీ కుప్పం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పారు. తాను సినిమాలలో ఎమ్మెల్యేల కంటే ఎక్కువే సంపాదిస్తున్నానని, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు మాత్రమే మార్గం కాదని వెల్లడించారు. అయితే తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని స్పష్టం చేశారు. సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీకి దిగుతానని తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని కూడా చెప్పుకొచ్చారు హీరో విశాల్(Hero Vishal).
అయితే ఏపీ సీఎం జగన్ ఎప్పటినుండో కుప్పంలో చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. చంద్రబాబును ఓడించే సత్తా కలిగిన వారిని బరిలోకి దించాలని కసరత్తు చేశారు. ఈ క్రమంలో వైసీపీ కుప్పం అభ్యర్థి హీరో విశాల్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సీఎం జగన్ వైసీపీ నేత భరత్ ను కుప్పం అభ్యర్థిగా ప్రకటించే వరకు ఈ ప్రచారం కొనసాగింది. భరత్ పేరు ప్రకటించిన తర్వాత కూడా భవిష్యత్తులో అయినా విశాల్ కుప్పం నుండి పోటీ చేస్తారని అక్కడక్కడా వినిపిస్తూనే ఉంది. తాజాగా విశాల్ కుప్పం నుండి పోటీ చేసే ఉద్దేశం లేదు అని చెప్పడంతో ఈ రూమర్లకు చెక్ పెట్టినట్లు అయింది.