పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జీ ఫార్మా ప్రమాద బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) పరామర్శించారు. వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదకర కెమికల్స్ కలుపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల అమాయక కార్మికులు బలవుతున్నారని మండిపడ్డారు.
‘‘యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరలో పరిశ్రమల భద్రతపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభిస్తాం. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు చేపడతాం. అచ్యుతాపురం ఘటనలో కూడా యాజమాన్య నిర్లక్ష్య ధోరణే కారణమని తెలిసింది. దానిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం’’ అని Vangalapudi Anitha వెల్లడించారు.