Husband Murder wife at srikakulam district: పిల్లలకు పెళ్లిల్లు అయిపోయాయి.. సంతోషంగా నడుస్తున్న జీవితంలోకి అనుమానం వచ్చింది. ఆ భార్యాభర్తల మధ్య చిచ్చు రేగింది. 60 ఏళ్ల వయస్సులో అనుమానం అనే రక్కసి, వారి కాపురాన్ని ముక్కలు చేసింది. దంపతుల మధ్య తరుచుగా వివాదాలు రేగాయి. ఈ నేపథ్యంలో 52 ఏళ్ల భార్యను 60 ఏళ్ల భర్త దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, నౌపడ పంచాయతీ జగన్నాథపురంలో జరిగింది.
జగన్నాథపురంలో నివాసం ఉంటున్న దాసరి సింహాద్రి(60), ఉమ(52) దంపతులు. శనివారం అర్థరాత్రి దాటిన తరువాత సింహాద్రీ తన భార్య ఉమను చాకుతో దారుణంగా గొంతు కోసి హత్య(Murder) చేశాడు. అనంతరం సింహాద్రి సైతం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారినా ఇంటి నుంచి బయటకు రాకపోవటంతో.. అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా, ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. భయాందోళనకు చెందిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న నౌపడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య విభేధాలు ఉన్నాయనీ, ఇద్దరూ ఘర్షణ పడేవారని స్థానికులు చెప్తున్నారు. అనుమానం నేపథ్యంలోనే హత్య చేసి, అతడు ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా, ఎంతో ప్రశాంతంగా ఉండే జగన్నాథపురంలో హత్య, ఆత్మహత్యలతో ఒక్కసారిగా అలజడి రేగింది.