తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకోవడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను కొంతమంది జనసైనికులు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై సినీ నటుడు హైపర్ ఆది (Hyper aadi) ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
‘‘వృత్తిపరంగా నేను కమెడియన్‌నే కావచ్చు. సమాజం, రాజకీయాలు, వ్యక్తులు, విలువలపై అన్నింటిపైనా అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. జనసేనకు 24సీట్లు అనగానే అందరూ పవన్‌ను తిడుతున్నారు. ఒకసారి ఆవేశంతో కాకుండా, ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పండి. తనని నమ్ముకున్న ప్రజల్ని, తనతో నడుస్తున్న నాయకులను మోసం చేసే వ్యక్తిత్వం పవన్‌కల్యాణ్ గారికి ఉంటుందా? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే, ఆ పార్టీని స్థాపించిన వ్యక్తి ఇంకెంత ఆలోచించి ఉంటాడు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంత మథనపడి ఉంటాడు. పదేళ్లుగా ఎలాంటి అవినీతి చేయకుండా, తన సొంత కష్టార్జితంతో పార్టీ నడుపుతున్న గొప్ప వ్యక్తి కల్యాణ్‌గారు. అలాంటి వ్యక్తి గురించి శత్రువులు మాట్లాడినట్లు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధగా ఉంది. 2019లో కనీసం ఆయన్ను అయినా గెలిపించుకోలేని మనకు ఇప్పుడు.. అదేంటి? ఇదేంటి? అని అడిగే హక్కు ఉందా’’
‘‘చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే పదిరోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేము. ఇలాంటి ప్రజా సంగ్రామంలో రెండు చోట్ల ఓడిపోయి, సమస్య అనగానే రెండోరోజే పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని పరిష్కరించిన గొప్ప మనసు ఆయనది. తన పిల్లల కోసం దాచిన డబ్బులను తీసి, కౌలు రైతుల కష్టాలు తీర్చిన వ్యక్తి గురించా? మనం ఇలా మాట్లాడేది. ఎన్నో రకాలుగా ఆయన సహాయం చేశారు. దేశ రాజకీయాల్లో ఎవరైనా సరే ‘మేము అధికారంలోకి వస్తే, అది చేస్తాం. ఇది చేస్తాం’ అనేవాళ్లే కానీ, ప్రతిపక్షంలో ఉండగా, వాళ్ల జేబు నుంచి ఒక్క రూపాయి తీసి సహాయం చేశారా? కానీ, పవన్‌కల్యాణ్ అలా కాదు. అలాంటి వ్యక్తిని పట్టుకుని, ‘కులాన్ని తాకట్టు పెట్టారు.. పార్టీని తాకట్టు పెట్టారు.. ప్యాకేజీ తీసుకున్నారు’ అని చాలా ఈజీగా అంటున్నాం. డబ్బుకు అమ్ముడుపోతారా? ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే, అధికార వైకాపా దగ్గరే ఎక్కువగా డబ్బు ఉంటుంది కదా! వాళ్లే కొనుక్కోవచ్చు కదా. ఎందుకండీ ఈ మాటలు. పవన్‌కల్యాణ్ ప్రజలు పంచే ప్రేమకు బానిస కానీ, నాయకులు పంచే డబ్బులకు బానిస కాదు. అభిమానించడం అంటే, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం.. లేనప్పుడు బై చెప్పడం కాదు. ఒక నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటమే నిజమైన అభిమానం’’
‘‘రెచ్చగొట్టే మాటలు విని మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదు. తెదేపా కార్యకర్తలకు కూడా నా విన్నపం. 2014లో ఒక్క సీటు కూడా ఆశించకుండా పూర్తి మద్దతు చంద్రబాబుగారికి ప్రకటించారు. ఆ త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఐటీని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన వ్యక్తిని జైల్లో పెడితే, చాలా మందికి బాధనిపించింది. పవన్ వెళ్లి ఆయన్ను కలిశారు. పొత్తు అనేది పెద్ద సభలు పెట్టి ఆడంబరంగా చేసుకోవచ్చు. కానీ, పవన్ అలా చేయలేదు. కష్టాన్ని చూసి, జైలు బయటకు వచ్చి, ‘కలిసి నడుస్తాం’ అని ప్రకటించారు. ‘అవసరంలో ఆదుకున్నాం కదాని, అనవసరంగా తప్పుగా మాట్లాడొద్ద’ని జనసైనికులకు చెప్పారు. పొత్తు ధర్మాన్ని ఇంత నిజాయతీగా ఎవరూ పాటించరు’’
‘‘ఎక్కువ సీట్లు తీసుకుని, ‘ఇన్నే గెలిచాడా’ అనిపించుకునేకన్నా, తక్కువ తీసుకుని, ‘అన్నీ గెలిచాడు’ అనిపించుకోవాలన్నది ఆయన అభిప్రాయం. తెదేపా కార్యకర్తలు కూడా ఆ 24 సీట్లలో జనసేనకు ఓట్లు బదిలీ అయ్యేలా చూడాలి. మిగిలిన చోట్ల తెదేపాకు జన సైనికులు సహకరించాలి. ధోని వచ్చిన కొత్తలో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మంచి షాట్‌లు కొట్టి 24 పరుగులు చేశాడు. ఇతడిలో గేమ్ ఉందని తెలిసేలా చేశాడు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్, విన్నర్ అయ్యాడు. క్రికెట్‌ను శాసించాడు. మన నాయకుడు కూడా అంతే. మొదట్లో రెండు చోట్ల ఓడిపోయి ఉండవచ్చు. ఇప్పుడు 24 సీట్లతో అసెంబ్లీకి వెళ్లవచ్చు. ఆయన గేమ్ ఛేంజర్ అవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించవచ్చు’’ అంటూ ఆది(Hyper Aadi) ఈ వీడియోలో తెలిపారు.
I really appreciate your strong loyalty to the party and our leader.
ఒక నిజమైన జనసైనికుడు ఎలా మాట్లాడాలో అలామాట్లాడావ్ ఆది…
#wearewithyoujanasenani pic.twitter.com/YqnCB6tK3J— Naga Babu Konidela (@NagaBabuOffl) February 26, 2024