మెగాస్టార్ చిరంజీవి నంటించిన భోళాశంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జబర్దస్త్ కమెడియన్, నటుడు హైపర్ ఆది(Hyper Aadi) మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేసే అందరికీ గట్టిగా ఇచ్చి పడేశాడు. ‘సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు సైనికుడిగా యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. అప్పటికే అక్కడ కండలు తిరిగిన యుద్ధవీరులెందరో ఉన్నారు. వాళ్ల యుద్ధం చేస్తున్నారు.. ఈయన చూస్తున్నాడు. ఓ రోజు ఈయనకి యుద్ధం చేసే సమయం వచ్చింది. యుద్దం చేశాడు. అందరూ కలిసి అతన్ని సైన్యాధిపతిగా ప్రకటించారు. ఒక 30 ఏళ్లు యుద్ధభూమిని ఏలాడు. ఆ యుద్ధభూమి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ సైనికుడే చిరంజీవి. అన్నయ్య ఇంతమంది సినీ సైన్యాన్ని తయారు చేసిన ఇంద్రసేనాని అయితే.. అక్కడ తమ్ముడు జనసైన్యాన్ని తయరు చేసి జనసేనాని అయ్యాడు’ అని తెలిపాడు.
ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో కానీ, ప్రతి ఇంట్లో మెగా ఫ్యాన్ ఉంటాడని, దేశంలో మొదటి కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న హీరోగా దశాబ్దాల కిందటే చిరంజీవి చరిత్ర సృష్టించాడన్నాడు. ఇటీవల వేల మందికి ప్రవచనాలు చెప్పే ఆ పెద్దాయన సహనాన్ని కోల్పోయినా చిరంజీవి సహనాన్ని కోల్పోకుండా ఆయనతో మంచిగా మెలిగి కార్యక్రమాన్ని సజావుగా ముగించడానికి సహాయపడ్డారని గుర్తు చేశాడు. గతంలో చిరంజీవి రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తే చిరంజీవి లైన్ క్రాస్ చేశారని ఓ ఎన్నారై లిమిట్ క్రాస్ చేశాడని, ఆ సమయంలో చిరంజీవి తప్పు లేకపోయినప్పటికీ ఆయనతో సహనాన్ని ప్రదర్శించారని పేర్కొన్నాడు.
మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)పైనా ఆది(Hyper Aadi) పరోక్షంగా సెటైర్స్ వేశాడు. నిర్మాతలకు పెద్దగా రిస్క్ ఏమీ లేదని, కలెక్షన్లు ఎంత వచ్చాయో లెక్క పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని, కొందరు మంత్రులు వాళ్ళ పని మానేసి మరీ మీ సినిమా కలెక్షన్లు లెక్కబెట్టి చెబుతారని కౌంటర్ ఇచ్చాడు. ఆయన మంత్రిగా ఉండి వెనకేసుకున్న కలెక్షన్లతో పోలిస్తే ఏ సినిమా కలెక్షన్‌లు అయినా తక్కువగానే ఉంటాయని ఎద్దేవా చేశాడు. ఇక దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద కూడా పరోక్షంగా సెటైర్స్ వేశాడు. చిన్న పెగ్ వేసినప్పుడు చిరంజీవి గారిని, పెద్ద పెగ్ వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారని, కానీ ఈసారి ఆయన వ్యూహాలు బెడిసి కొడతాయని వ్యాఖ్యానించాడు.
ఫైనల్‌గా అన్నయ్య చిరంజీవి(Chiranjeevi) మంచోడు కాబట్టి ముంచేశారు.. తమ్ముడు పవన్ కల్యాణ్ మొండోడు ముంచడాలు ఉండవు. తాడోపేడో తేల్చుకోవడమే అని తెలిపాడు. అన్నయ్యని విమర్శించిన ప్రతి ఒక్కరికి తమ్ముడు వడ్డీతో సహా తీర్చేస్తాడని అంటూ విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశాడు ఆది. మొత్తానికి హైపర్ ఆది స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.