రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటిపారుదల రంగాలపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఆడిలైడ్ నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తరఫున జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ప్రకటించారు. దేశంలో మెుత్తం నాలుగు సాగునీటి కట్టడాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించగా.. అందులో ధవళేశ్వరం మెుదటి స్థానం కైవసం చేసుకుంది. ఈ ఆనకట్టను సర్ ఆర్థర్ కాటన్ అనే బ్రిటీష్ ఇంజనీరు ఆధ్వర్యంలో 1847లో ప్రారంభించి, 1852 నాటికి పూర్తి చేశారు. ఆయన జ్ఞాపకార్థంగానే కాటన్ దొర బ్యారేజీగా ధవళేశ్వరం ప్రాజెక్టును పిలుచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారటానికి ఈ కాటన్ బ్యారేజీయే ప్రధాన కారణంగా చెప్పుకుంటారు.
ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా కాటన్ బ్యారేజీ
-