టీడీపీ-బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం జరిగింది. దాదాపు 8 గంటల పాటు సీట్ల సర్దుబాటుపై సమావేశం కొనసాగింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండా, జనసేనాని పవన్ కల్యాణ్, చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చారు. ఈ మేరకు మూడు పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి.
టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో బరిలో దిగనున్నాయి. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. పొత్తు ధర్మం పాటిస్తూ జనసేన పార్టీ తనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో 3 స్థానాలు బీజేపీకి కేటాయించగా.. టీడీపీ ఓ స్థానాన్ని వదులకుంది. ఎంపీ స్థానాలకు వస్తే అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థులు.. మిగిలిన నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు.