మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని(Vallabhaneni Balashowry) జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని.. ఇందుకు సంబంధించి తుది కసరత్తు పూర్తైన తరువాత అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి(Vallabhaneni Balashowry) ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన విషయం విధితమే. పొత్తులో భాగంగా జనసేన(Janasena)కు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరు ఇప్పటికే ప్రకటించారు. ఇక 19 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను వెల్లడించారు. ఇదిలా ఉంటే నేటి నుంచి పిఠాపురం కేంద్రంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.