అగ్రి గోల్డ్ భూముల కేసు(Agrigold Case)లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్(Jogi Rajeev)కు ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. అతనితో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన సర్వేయర్ రమేష్‌కు బెయిల్‌ను ఇస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జోగి రాజీవ్ రిమాండ్ ఖైదీగా ఉన్న విజయవాడ జైలు దగ్గర పోలీసులు అప్రమత్తమై, ఆయన విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే తన తండ్రిపై ఉన్న కక్ష కారణంగా తనను అరెస్ట్ చేశారని, అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని అరెస్ట్ సమయంలో రాజీవ్ అన్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఈరోజు ఆయనకు బెయిల్ మంజూరైంది. విజయవాడ అంబాపురం భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసు విచారణలో భాగంగానే రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ కేసులో జోగి రాజీవ్ ఏ1గా ఉండగా, జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఏ2గా ఉన్నారు. వీరిపై ఐపీసీ 420, 409, 467, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజీవ్(Jogi Rajeev)ను గొల్లపూడి కార్యాలయానికి తరలించారు అధికారులు.