ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు(Kadambari Jethwani Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్(Kukkala Vidyasagar)కు రిమాండ్ విధించడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్‌లో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ పేర్లను నిందితుల జాబితాలో చేర్చడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు పోలీసు అధికారులను నిందితుల జాబితాలో చేర్చడం జరిగింది. వారిలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ2, కాంతిరాణా తాతా ఏ3, వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు ఏ4, ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ ఏ5, విశాల్ గున్నీ ఏ6గా ఈ కేసులో ఉన్నారు. ఈ ఐదురుగు అధికారులను ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
కాగా జెత్వానీ కేసు(Kadambari Jethwani Case)లో ఏ1గా తన పేరు చేరిందన్న విషయం తెలిసిన వెంటనే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పరాయ్యారు. దీంతో వెంటనే ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, తన స్నేహితుడి ఫోన్ వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు తమ గాలింపులను ముమ్మరం చేశారు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు బృందం.. డెహ్రాడూన్ నుంచి విద్యాసాగర్‌ను ఆదివారం రాత్రి విజయవాడకు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి వైద్య పరీక్షలు చేయించి వెంటనే తెల్లవారు జాము 4 గంటల సమయంలో జడ్జి ఇంట్లో న్యాయమూర్తి ముందు విద్యాసాగర్‌ను హాజరిచారు. పోలీసులు రిపోర్ట్ పరిశీలించిన అనంతరం విద్యాసాగర్‌కు అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. జడ్జి ఆదేశాలతో పోలీసులు.. విద్యాసాగర్‌ను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు.