తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) కలిశారు. ఆయన వెంట మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, దేవినేని అవినాశ్ ఉన్నారు. జగన్‌ను కలిసిన అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Nara Lokesh)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ కోసం తన సొంత ఆస్తులు అమ్ముకున్నానని తెలిపారు. అలాగే ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేశ్‌కు తాను గులాంగిరీ చేయాలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పాదయాత్ర చేస్తే తాను ఎందుకు పాల్గొనాలని అని ప్రశ్నించారు.
అయితే జగన్(CM Jagan)ను కేశినేని కలవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిన్నటి దాకా నా స్థాయి రతన్ టాటా స్థాయి అన్నావ్.. దేశంలోనే చంద్రబాబు అత్యంత నీతి పరుడు అన్నావ్. ఇప్పుడేమో అత్యంత అవినీతిపరుడు అంటూ విమర్శించిన వ్యక్తిని కలిశావ్.. అంతేలా రాష్ట్రం ఎలా పోతే మీకెందుకు.. రాజధాని లేకపోతే మీకెందుకు.. మీకు, మీ కుటుంబం బాగుంటే చాలు కదా” అంటూ ప్రశ్నిస్తున్నారు.
గతంలో స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అవినీతి మచ్చ లేని నాయకుడు చంద్రబాబు అని కేశినేని నాని(Kesineni Nani) కొనియాడారు. ఇప్పుడు ఆయనపైనే పచ్చి మోసగాడు అంటూ విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ టీడీపీ(TDP) క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తే ఘోరంగా ఓడిస్తామని.. ఆయనతో పాటు వెళ్లిన ప్రతి ఒక్కరికి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.