ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా..తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్(MP Sanjeev Kumar) పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి కూడా రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఈసారి కర్నూలు ఎంపీగా ఆయన బదులు మంత్రి జయరామ్‌ను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. దీంతో పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి తప్ప బీసీలకు ప్రాధాన్యత దక్కడం లేదని చెబుతూ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త్వరలోనే ఆయన టీడీపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి(Kolusu Parthasarathy) కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం నేత బొమ్మసాని సుబ్బారావు.. పార్థసారథిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీనిపై పార్థసారథి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న గుడివాడలో జరిగే ‘రా.. కదలిరా’ బహిరంగసభలో చంద్రబాబు(Chandrababu) సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే జగన్ సన్నిహిత ఎమ్మెల్యేలు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy), కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పటికే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆర్కే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామచంద్రా కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు.