బెజవాడ(Vijayawada) వాసుల్ని కొండ చరియలు భయపెడుతున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రి, కస్తూరిబాయిపేటలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి సమయంలో పెద్దపెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. రాత్రి సమయం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెద్దగా లేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బండరాళ్లు విరిగిపడడంతో ఘాట్ రోడ్డులో భక్తుల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. కొండ కింది నుంచి లిఫ్ట్ ద్వారా భక్తులను ఆలయానికి తరలిస్తున్నారు.
మరోవైపు విజయవాడ(Vijayawada) కస్తూరిబాయిపేటలో కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఓ మహిళకు తలకు బలమైన గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వర్షాకాలం కావడంతో కొండ చరియలు ఎప్పుడు విరిగిపడతాయో అని స్థానికులు భయాందోళన గురవుతున్నారు. అధికారులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు. బాధితులను స్థానిక సిపిఎం నాయకులు పరామర్శించారు. వారిని ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.