Vizag By Election | స్థానిక సంస్థల ఉపఎన్నికలకు విశాఖ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తన నామినేషన్‌ను దాఖలు చేసేశారు. కానీ కూటమి మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అసలు అభ్యర్థి ఎంపికను పూర్తి చేసినట్లుగా కూడా కూటమి కనిపించడం లేదు. దీంతో ఈ ఉప ఎన్నికలకు కూటమి దూరంగా ఉండనుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఉపఎన్నికల బరిలో నిలవడానికి కూటమికి ఇదే ఆఖరి రోజు.
ఉపఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు కూటమి నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం చర్చనీయాంశంగా ఉంది. కాగా ఈరోజే ఎవరినైనా ఖారారు చేయించి నామినేషన్ వేయిస్తుందేమో అని కూడా చర్చలు జరుగుతున్నాయి. తన నామినేషన్‌లో బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఎన్నికల తర్వాత తన అప్పులు పెరిగినట్లు ఆయన తన నామినేషన్లో పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత తన అప్పులు 93 లక్షలు పెరిగాయని, అదే విధంగా ఆస్తులు రూ.73.14 లక్షలు పెరిగాయని బొత్స చూపించారు.
Vizag By Election | ఇదిలా ఉంటే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో ఎంపీటీసీలు 636 మంది, జడ్పీటీసీలు 36 మంది, కార్పొరేటర్లు 97 మంది, కౌన్సిలర్లు 53 మంది, ఎక్స్ అఫీషియో సభ్యులు 16 మంది, ముగ్గురు వైసీపీ ఎక్స్ అఫీషియో కింద దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉన్నాయి. వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తామే గెలుస్తామని తెలిసి కూడా కూటమి తన అభ్యర్థిని నిలబెట్టాల్సిన పనేముందని, అది అనైతికమే అవుతుందని బొత్స వ్యాఖ్యానించారు.