తిరుమల(Tirumala)లో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది. ఇప్పటికే చిరుతల దాడి నేపథ్యంలో భక్తులకు చేతి కర్రలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. వేగంగా రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు వాటర్ హౌస్ దగ్గర భక్తులను నిలిపి వేశారు. బస్సులను, కార్లను మాత్రమే అనుమతిస్తున్నారు. కాలి నడకన వెళ్లే భక్తులను గుంపులుగా కొండపైకి అనుమతిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఆంక్షలను టీటీడీ కొనసాగిస్తోంది.
Tirumala | గత కొద్దికాలంగా తిరుమల నడకమార్గాల్లో చిరుత, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణుల సంచారం విపరీతంగా పెరిగింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడి చేశాయి. అందులో లక్షిత అనే చిన్నారి మృతి చెందింది. అప్పటి నుంచి టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. టీటీడీ, అటవీ శాఖ సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని చిరుతలను బోన్లలో బంధించారు. అయినా కానీ చిరుతల సంచారం తగ్గలేదు. దీంతో కాలినడకన వెళ్లే భక్తులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు.