మంగళగిరి(Mangalagiri) వైసీపీ ఇన్చార్జి గంజి చిరంజీవి(Ganji Chiranjeevi)కి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) ఇంటి వద్ద ఘోర అవమానం జరిగింది. ఆయనను కలిసేందుకు ఇంటికి వెళ్ళిన చిరంజీవి గంటసేపు ఇంటి బయటే వెయిట్ చేయాల్సి వచ్చింది. చివరికి కలవకుండానే అక్కడి నుండి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఎదురైంది. దీంతో గంజి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్(CM Jagan) రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సెగ్మెంట్లలో ఇన్చార్జుల మార్పులు చేర్పులు చేశారు. ఈ క్రమంలో మంగళగిరి(Mangalagiri)లో వైసీపీ ఇన్చార్జిగా గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పటికే క్యాబినెట్ లో చోటు దక్కలేదని అసంతృప్తితో ఉన్న ఆర్కేకి మరో షాక్ తగిలినట్టు అయింది. ఈ ఎన్నికల్లో మంగళగిరి టికెట్ కూడా దక్కదని ఆయన ఫిక్స్ అయినట్టున్నారు. దీంతో పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్తు కార్యాచరణ పై ఆలోచనలో పడ్డారు. రాజీనామా అనంతరం మీడియాతో కానీ కార్యకర్తలతో కానీ ఎలాంటి మీటింగ్ నిర్వహించలేదు.
అయితే, గురువారం తన స్వగృహంలోనే ముఖ్య నాయకులు, అనుచరులతో భేటీ అయ్యారు ఆర్కే. భవిష్యత్తు కార్యాచరణ పై సమీక్ష నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. నాయకులు, అనుచరులు అధైర్యపడొద్దని సూచించారు. కాగా, హైదరాబాద్ లోని కొంతమంది కీలక నాయకులను కూడా ఆయన కలవనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆర్కే వర్గీయులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఈరోజు ఆర్కే ని కలిసేందుకు వైసీపీ ఇన్చార్జ్ గంజి చిరంజీవి ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. భేటీ ముగిసిన కాసేపటికే చిరంజీవి ఆర్కే ఇంటి వద్దకు చేరుకున్నారు. కానీ ఆర్కే మాత్రం చిరంజీవిని కలిసేందుకు ఇష్టపడలేదు. ఇంట్లో లేరని చెప్పడంతో గంటసేపు అక్కడే వెయిట్ చేసి వెనుతిరిగారు చిరంజీవి. ఈ ఘటన చిరంజీవి వర్గీయులను బాధించింది. ఇంట్లోనే ఉండి లేరని చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చిన మనిషిని అలా అవమానించి పంపించడం గౌరవం కాదని మండిపడుతున్నారు.