ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి వైసీపీ నేతలను ఇంకా కలవరపరుస్తున్నట్లుంది. ఆ ఫలితాలు వచ్చిన దగ్గరి నుంచి వైసీపీలో అసంతృప్తి స్వరాలు ఎక్కువైపోతున్నాయి. బహిరంగంగానే పార్టీ అధిష్టానంపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ పార్టీ కార్యకర్తలపై తీవ్ర అసహనం వ్యక్తంచేయడం పార్టీ పరిస్థితికి అద్ధంపడుతోంది.
విజయనగరం జిల్లాలోని తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన బొత్స కార్యక్రమం అనంతరం కారులో బయలుదేరారు. ఈ సమయంలో శృంగవరపుకోట టౌన్ వైసీపీ అధ్యక్షుడు ఆయనను కలిసి స్థానిక పరిస్థితులను గురించి వివరించబోయారు. అంతే ఆయన ఒక్కసారిగా రెచ్చిపోయారు. యూజ్ లెస్ ఫెలో.. కార్యకర్తలో క్రమశిక్షణ లేదని మండిపడ్డారు. మీకేనే బాధలు.. మాకు కూడా బాధలు ఉంటాయి.. పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి అంటూ తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.దీంతో అక్కడున్న కార్యకర్తలు షాక్ అయ్యారు. బొత్స ప్రవర్తన పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందని కేడర్ ఆవేదన వ్యక్తంచేస్తోంది.