చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం దగ్గర ఐరల్ లోడ్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి ఎదురుగా పక్క రోడ్డులో వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా మరో 30 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్(Minister Ramprasad Reddy) విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సరికొత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతి ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు వ్యాఖ్యానించారు. ధర్మవరంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి.. నివాసంలో ఆయన ఈ ప్రమాదంపై మాట్లాడారు.
ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. అదే విధంగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష అందిస్తామని, బస్సు డ్రైవర్ కుటుంబానికి ఆర్టీసీ తరపున బీమా రూ.80 లక్షల వరకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో మూడు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరగడంపై కూడా ఆయన స్పందించారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని Minister Ramprasad Reddy చెప్పారు.