ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్(RamPrasad Reddy) కీ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని మరో వారం రోజుల్లో అమలు చేసేలా కసరత్తులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్టీసీ అధికారులతో ఈ పథకం అమలుపై సమీక్షలు నిర్వహిస్తున్నామని, అతి త్వరలో పథకం అమలుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఆర్టీసీ, రవాణా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
‘‘రాష్ట్రంలో రేషన్, మైన్స్ అక్రమ రవాణాను నివారిస్తాం. కాలం చెల్లిన బస్సులు తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకొస్తాం. ఆర్టీసీలో 7వేల మంది సిబ్బంది కొరత ఉంది. వీటి భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఈ 12న శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తాం. అనంతరం ఉచిత ప్రయాణం పథకంపై అధికారిక ప్రకటన చేస్తాం’’ అని చెప్పారాయన( RamPrasad Reddy).