అమరావతి రైతులను పాదయాత్రను ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటామంటూ మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Sidiri appalaraju) వ్యాఖ్యానించారు. మా కడుపును కొడతామంటే చూస్తే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీడీపీ నేతలపై, అమరావతి రైతులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 15న నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరుగుతోంది.. టీడీపీ పాదయాత్ర పేరిట మా గుండెలపై కొడతామంటే ఎలా ఒప్పుకుంటాం అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అన్నం తింటుంటే.. విశాఖను రాజధానిగా ఒప్పుకోవాలన్నారు. అసలు ఉత్తరాంధ్ర అచ్చెన్నకు ఏం అన్యాయం చేసిందని, విశాఖను రాజధానిగా ఒప్పుకోవటం లేదని (Minister Sidiri appalaraju) ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు బాగుపడటానికే, అమరావతి పేరిట కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పవన్ అనంతరం రాజధాని అంటారు.. కర్నూలు వెళ్లి మనసంతా కర్నూలే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.. ఇప్పుడు విశాఖ వెళ్లి అదే మాట చెప్పారని ఎద్దేవా చేశారు. ఏ ప్రయోజనాల కోసం పవన్ ఇలా కొత్తమాటలు చెప్తున్నారు అని నిలదీశారు. పవన్ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేసుకునేందుకు, ప్రజలంతా విశాఖ గర్జనకు తరలిరావాలని మంత్రి సీదిరి పిలుపునిచ్చారు.