వైసీపీ(YCP)లో రాజీనామాల పర్వానికి ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. ఒకరి తర్వాత ఒకరుగా ఎవరో ఒక నేత పార్టీ నుంచి తప్పుకుంటూనే ఉంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ(MLC Jayamangala) కూడా చేరారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు పార్టీకి టాటా చెప్పగా ఇప్పుడు అకస్మాత్తుగా జయమంగళ కూడా మంగళం పాడేయడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనమా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆయేన శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు అందించారు.
అయితే జయమంగళ వెంకటరమణ(MLC Jayamangala) తొలుత టీడీపీలోనే ఉన్నారు. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్సీగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని నమోదు చేసినప్పటి నుంచి ఆయన పార్టీకి కాస్తంత దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాగా తన భవిష్యత్ కార్యాచారణ ఏంటనేది ఇంకా వెల్లడించలేదాయన. కానీ మళ్ళీ సొంత గూడు టీడీపీలోకే వెళ్లాలన్న ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.