తెలుగు చలన చిత్రపరిశ్రమ దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు.
వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ.. లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్.’’ అని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) పేర్కొన్నారు.