Mudragada Daughter Kranthi | ఏపీ రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు ప్రచార హోరు మోతమోగుతోంది. రాష్ట్రమంతా ఈసారి ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్థానం పిఠాపురం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ను ఎలాగైనా ఓడించాలని అధికార వైసీపీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు జనసేన కూడా వైసీపీ కుట్రలను ఎదుర్కొనేందుకు ధీటుగా నిలబడుతోంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే తన లక్ష్యమంటూ ముద్రగడ పద్మనాభం(Mudragada) ఘాటు విమర్శలు చేశారు. పవన్‌ను ఓడించి పిఠాపురం నుంచి పంపకపోతే తన పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. దీంతో ముద్రగడ సవాల్‌పై ఆయన సొంత కూతురు క్రాంతి తీవ్రంగా స్పందించారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు.
‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించటానికి వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్న పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభం(Mudragada) బదులు పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని తెలిపారు. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదు. వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించడానికి కష్టపడొచ్చు.. కానీ పవన్ కళ్యాణ్‌ను, ఆయన అభిమానుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉండకూడదు. మా నాన్నను కేవలం పవన్ కళ్యాణ్‌ను తిట్టడం కోసమే జగన్ మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్న పద్మనాభం ఎటూ కాకుండా అయిపోతారు. ఈ విషయంలో నేను మా నాన్న తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నావంతుగా కృషి చేస్తా’ అంటూ వీడియోలో ప్రస్తావించారు. దీంతో ముద్రగడకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం క్రాంతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.