Nagababu | అమాయకుడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఐదేళ్ల కిందట ఆయనపై జరిగిన హత్యాయత్నానికి సంబందించి న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019 ఎన్నికల ముందు విశాఖ విమానాశ్రయంలో జగన్(YS Jagan)పై కోడికత్తితో హత్యాయత్నం జరిగిందని, దానిపై ఆయన అప్పటి నుంచి పోరాడుతున్నా న్యాయం జరగలేదంటూ ఎద్దేవా చేశారు. దీనిపై దృష్టిపెట్టి అమాయకపు జగన్‌కు న్యాయం చేయాలని ఎక్స్ వేదికగా చురకలంటించారు.
‘‘2019లో శ్రీను అనే వ్యక్తి జగన్‌పై కోడికత్తితో దాడి చేశాడు. ఆ ఘటన జరిగి ఐదేళ్లు పూర్తయ్యాయి.కానీ కేసు మాత్రం కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్ బిజీ షెడ్యూల్ కారణంగా కోర్టు చుట్టూ తిరగలేకపోయారు. కానీ ఇప్పుడు అంతా ఖాళీనే. కాబట్టి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అమాయకపు జగన్‌కు న్యాయం జరిగేలా చూడాలి. నేరస్థుడికి శిక్ష పడేలా చూడాలి. కేసు దర్యాప్తును తక్షణమే వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని, సీఎంను, డిప్యూటీ సీఎంను, హోం మంత్రిని కోరుతున్నా’’ అంటూ ఎక్స్‌లో Nagababu పోస్ట్ పెట్టారు.