మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు(Nandikotkur) ఎమ్మెల్యే ఆర్థర్(MLA Arthur) పార్టీ కి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగా సన్నిహితులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయం మేరకు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని మీడియాకి తెలిపారు. కార్యకర్తల మనస్సులో స్థానం సంపాదించుకున్నానని, కార్యకర్తల నిర్ణయమే తన తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్(YS Jagan) చెప్పినట్టే నియోజకవర్గంలో నడుచుకున్నానని అన్నారు. అధిష్టానం తనకు ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించానని చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడంపై బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నందికొట్కూరు ప్రజలు తనని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలి అనుకుంటున్నారని తెలిపారు. అందుకే మరోసారి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ పై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.
కాగా, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్(MLA Arthur) కి, నియోజకవర్గ ఇన్చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకి టికెట్ రాకుండా బైరెడ్డి అడ్డుపడ్డారని ఎమ్మెల్యే ఆర్థర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. తనకి అనుకూలమైన వ్యక్తికి టికెట్ ఇప్పించేందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి(Byreddy Siddharth Reddy) పావులు కదిపారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళాలని కార్యకర్తలు ఆర్థర్ కి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థర్ మాట్లాడుతూ.. తాను ప్రజల గుండెల్లో చోటు దక్కించుకున్నానని, ప్రజలు తనని ఎమ్మెల్యేగా చూడాలి అనుకుంటున్నారని చెబుతున్నారు. కానీ వైసీపీ(YCP) నుండి టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో అభిమానులు, కార్యకర్తల సూచన మేరకు ఆయన పార్టీ మారే చాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.