తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని పరిణామం జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh)కు ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) క్రిస్మస్ కానుకలు పంపారు. “వైయస్సార్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి” అంటూ షర్మిల సందేశం కూడా తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు.
“ప్రియమైన షర్మిల గారూ.. మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మీకు, మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ పండుగతో పాటు నూతన సంవత్సరం కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకాంక్షలు తెలుపుతోంది” అంటూ లోకేశ్(Nara Lokesh) తెలిపారు.
అయితే కొంతకాలంగా సీఎం జగన్‌తో వ్యక్తిగత విభేదాల కారణంగా షర్మిల దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఎన్నికల సమయంలో లోకేశ్‌కు వైయస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపడంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.