ఇటీవల చిన్నారులపై జరిగిన చిరుత దాడుల నేపథ్యంలో నడకమార్గంలో టీటీడీ కొత్త రూల్స్ ప్రకటించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుపతి పద్మావతి అతిథి గృహంలో టీటీడీ హై లెవెల్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలను అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. రాత్రి పది గంటల వరకు మాత్రం పెద్దలకు నడకమార్గంలో అనుమతి ఉంటుందని తెలిపింది. భక్తులను గుంపులు.. గుంపులుగా దర్శనానికి పంపాలని నిర్ణయించింది. నడకదారిలో జంతువులకు తినుబండారాలు ఇవ్వకూడదని భక్తులకు సూచించించింది. అలాగే హోటల్స్ వ్యర్థాలు కూడా ఎక్కడపడితే అక్కడ వేయకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అలాగే భద్రత కోసం 500 ట్రాప్ కెమెరాలు, డ్రోన్స్ వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.
అలిపిరి, గాలిగోపురం, 7వ మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. భక్తుల రక్షణే ప్రథమ ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామంది. వన్యమృగాల సంచారం తగ్గుముఖం పట్టే వరకూ ఇవే నిబంధనలు అమలు చేస్తామని చెప్పింది. వన్యప్రాణుల అధ్యాయనం కోసం ఫారెస్టు అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని వివరించింది. భక్తులు సురక్షితంగా తిరుమలకు వచ్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామంది. భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటవీశాఖ అధికారులతో చర్చలు జరిపామని తెలిపింది. అవసరమైతే నడక దారిలో ఫోకస్ లైట్స్ ఉంచాలని నిర్ణయం తీసుకున్నామని.. ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ శాఖ అధికారుల నుండి సూచనలు తీసుకున్నామని వెల్లడించింది.