Tana New President | అమెరికాలో ఎంతో ప్రెస్టీజియస్ గా భావించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షునిగా ఏపీ కి చెందిన నిరంజన్ శృంగవరపు(Niranjan Srungavarapu) బాధ్యతలు చేపట్టారు. అమెరికాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్నా తానా 23 వ మహాసభల్లో ఆదివారం నిరంజన్ ప్రమాణస్వీకారం చేశారు. 2025 వరకు నిరంజన్ ఆ బాధ్యతలలో వుంటారు. రాష్ట్రంలోని నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం రాజానగరం నిరంజన్ స్వగ్రామం. రాజానగరం గ్రామంలో శృంగవరపు సుబ్రహ్మణ్యం, ఇంద్రావతి అనే వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నిరంజన్ స్వయంకృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్నారు.
హై స్కూల్ విద్యను రాజానగరంలో, కళాశాల విద్యను యర్రగుంట్ల ప్రభుత్వ కళాశాలలో చదివిన నిరంజన్ గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో పట్టా సాధించారు. విద్యాభాసం అనంతరం హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరి అమెరికా అవకాశం రావటంతో 2001 లో ఆ దేశానికి వెళ్లారు. అక్కడ వివిధ సంస్థలలో ఉద్యోగం చేసి చివరకు 2003 లో నోవీ ప్రాంతంలో స్వయంగా ఒక సాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. 2008 వ సంవత్సరం నుంచి తానా లో చురుకైన పాత్ర పోషిస్తూ వివిధ హెూదాలలో సేవలందించారు.
ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ జన్మభూమిని మరువకుండా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన స్వగ్రామమైన రాజానగరం జెడ్పీ హై స్కూల్ లో లైబ్రరీ, ఖమ్మం జిల్లా గోల్డెన్ పహాడ్ లో సురక్షిత త్రాగునీటి పథకానికి నిధులు ఇవ్వటంతో పాటు, రాజానగరంలో లక్షలాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక వైద్య సామాగ్రితో కంటివైద్య శిబిరం నిర్వహించి, ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించారు. అదేవిధంగా కడప లోని పుష్పగిరి ఆసుపత్రికి భారీ విరాళాన్ని అందజేశారు.
వీటితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, లాప్ టాప్ లు అందజేసి, వారు ఉన్నత విద్యాభాసం చేసేందుకు అవసరమైన ఆర్ధిక ప్రోత్సాహాన్ని అందజేస్తున్నారు. తానా అధ్యక్షుని(Tana New President)గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిరంజన్ ను పలువురు తెలుగు ప్రముఖులు అభినందించారు. ఇప్పటివరకు తాను తెలుగుప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయనున్నట్టు నిరంజన్ వెల్లడించారు.
Read Also: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat