నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4, 210 నామినేషన్లు దాఖలు కాగా.. 25 పార్లమెంట్ స్థానాలకు 731 మంది నామినేషన్లు వేశారు.
అటు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంంది. లోక్‌సభ స్థానాలకు మొత్తం 600కు పైగా నామినేషన్లు దాఖలు కాగా.. కంటోన్మెంట్ స్థానానికి 38 మంది నామినేషన్లు వేశారు.
శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఉంది. ఏప్రిల్ 29 సాయంత్రం పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 11వ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుండగా..మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.