ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో ముకుల్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముకుంద్‌చంద్ కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని సెల్వమణి ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన బోత్రా.. సెల్వమణిపై పరువునష్టం దావా వేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో బోత్రా కన్నుమూయడంతో ఆయన కుమారుడు గగన్ కోర్టులో ఈ కేసు విచారణను కొనసాగిస్తున్నారు.
సోమవారం జరిగిన ఈ కేసు విచారణకు సెల్వమణి హాజరుకాలేదు. గతంలో కూడా చాలా సార్లు సెల్వమణి విచారణకు ఎగొట్టారు. ఆయన తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు రాలేదు. దీంతో ఆయన గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేశారు. ప్రస్తుతం దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ) అధ్యక్షుడుగా ఉన్న సెల్వమణి హీరోయిన్ రోజాను 2002 ఆగస్టు 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె అంశుమాలిక, ఒక కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు.