చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మరణించగా మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరికీ తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారు కోలుకుంటున్నారని వెల్లడించారు. వారంతా కూడా ఒంగోలుకు చెందిన ఏవీఆర్ సంస్థలో పనిచేస్తున్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు చెప్పారు.
Chittoor | రోడ్డు ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా రోడ్డు ప్రమాదానికి కారణం ఏంటనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు. కూలీలు గొట్టిగంటివారిపల్లె దగ్గర వాటర్ ట్యాంక్ నిర్మాణ పని కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.