తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam) తాత్కాలిక గేటు నిర్మాణం మరో రోజు ఆలస్యం జరిగింది. యంత్రాలు, నిపుణ కార్మికులు అంతా డ్యామ్ దగ్గరకు బుధవారమే చేరుకున్నారు. కానీ తాత్కాలిక గేటు (ఎలిమెంటు) మాత్రం డ్యామ్‌కు చేరుకోలేదు. గేటు రవాణాలో జాప్యం కారణంగా తాత్కాలిక గేటు నిర్మాణం ఆలస్యమవుతోంది. మూడు రోజులుగా రాత్రి వేళ వర్షం పడుతుండటం, పగటిపూట ఎండలు మండుతుండటంతో పనులు చేపట్టడానికి వీలు కుదరడం లేదు. ఏపీకి చెందిన నిపుణుడు కన్నయ్యనాయుడి సమక్షంలో ఎలిమెంటును అమర్చాల్సి ఉంది. ఆయన వయసు 85 సంవత్సరాలు కావడంతో అనుకూలించిన వాతావరణం కారణంగా ఆయన ఇబ్బంది పడకూడదని, ఆయన ఆరోగ్యం క్షీణించకూడదని డ్యామ్ ఇంజినీర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
మరోవైపు తన వయసుతో సంబంధం లేకుండా వీలైనంత త్వరగా డ్యామ్ పనులను పూర్తి చేయాలని, తాత్కాలిక గేటును ఏర్పాటు చేయాలని కన్నయ్యనాయుడు(Kannaiah Naidu) కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డ్యామ్‌కు వరద ఇన్‌ఫ్లో పరిమాణంలో పెరుగుదల కనిపిస్తోంది. మూడు రోజుల క్రితం 20 వేల క్యూసెక్కులుగా ఉన్న డ్యామ్(Tungabhadra Dam) నీటి మట్టం.. ఈ మూడు రోజుల వర్షం కారణంగా 32 వేల క్యూసెక్కులకు చేరింది. ఏది ఏమైనా ఈనెల 18 లోపు ఎలిమెంటును అమర్చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుకు ఈనెల 18 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించడమే కారణం. అప్పటి వరకు గేటు ఏర్పాటు జరగకుంటే ఆ తర్వాత అసాధ్యమవుతుందని, తద్వారా అనేక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.