మాజీ మంత్రి పరిటాల రవీంద్ర(Paritala Ravi) హత్య వెనుక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Paritala Sunitha) సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ కూడా ఈ కేసులో జగన్ని విచారించిందని ఆమె గుర్తు చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి సంఘటన నేపథ్యంలో జగన్ జిల్లాకు వస్తుండటంపై ఆమె తీవ్రంగా స్పందించారు. అలాగే గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు చేస్తున్న వ్యాఖ్యల మీద ఆమె తీవ్రంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. తోపుదుర్తి సోదరులు నియోజకవర్గంలో అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ కుల, శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కారు బాంబు, సూట్ కేస్ బాంబు, 45 హత్యలకు జగన్ సమాధానం చెప్పాలి…
తోపుదుర్తి సోదరులు ఎప్పుడు మాట్లాడినా టీవీ బాంబు గురించి ప్రస్తావిస్తుంటారని.. అయితే వారు కారు బాంబు గురించి ఎందుకు మాట్లాడరని సునీత(Paritala Sunitha) ప్రశ్నించారు. కారు బాంబు ఘటనలో 24 మందిని పొట్టన పెట్టుకున్నారని,. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ఈ సంఘటనలో తోపుదుర్తి సోదరులు జైలుకు కూడా వెళ్లి వచ్చారని అన్నారు. మంగళవారం వస్తానంటున్న జగన్ రెడ్డికి శుక్రవారం బాగా అచ్చి వస్తుందని.. ఆ వచ్చేటప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి రావాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి(YS Jagan) సూట్ కేసు బాంబు గురించి కూడా బాగా తెలుసునని, ఆయన అప్పట్లోనే పరిటాల రవిని హత్య చేసేందుకు ప్రయత్నించారన్నారు. పరిటాల రవీంద్ర హత్య వెనుక జగన్ హస్తం ఉందన్నారు.
ఈ కేసులో సిబిఐ వారు కూడా జగన్ ని విచారించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో 45 మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర మీకు ఉందని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు బాంబు, సూట్ కేస్ బాంబుతో పాటు 45 మందిని చంపిన వాటికి సమాధానం చెప్పి జగన్ జిల్లాలోకి రావాలన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు రేపేందుకు జగన్ వస్తున్నారా అని ప్రశ్నించారు. మా ప్రాంతం ప్రశాంతంగా ఉందని అలా ఉండటం మీకు ఇష్టం లేదా అని సునీత వైసీపీ నాయకులను నిలదీశారు.