ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే రాజకీయాల్లో తనదైన మార్క్ చూపడం మొదలు పెట్టారు పవన్ కల్యాణ్. జనసేనిని జనాల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాలని, అలా చేయడాలంటే తనకు అప్పటించిన శాఖలపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలని, ఆ పనిపై కూడా దృష్టి సారించారాయన. ఒకవైపు తన శాఖలను అవగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు ఎప్పటికప్పుడు అధికారులకు సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేయాలని, విధుల్లో నిర్లక్ష్య ధోరణికి స్థానం లేదని చెప్తూ వస్తున్నారు. తాజాగా తనను కలవడానికి వచ్చే వారికి కూడా పవన్ కల్యాణ్ ఓ వినూత్న విజ్ఞప్తి చేశారు.
‘‘నన్ను కలవడానికి వచ్చే వారు ఎవరూ కూడా నాకు బహూకరించడానికి విగ్రహాలు, బొకేలు, శాలువాలు తీసుకురావొద్దు. వాటికి బదులగా ప్రజలకు ఉపయోగపడేవి ఏవైనా తీసుకురండి. బొకేలు, శాలువాల బదులు అదే వ్యయంతో ఫలాలు, కూరగాయలు వంటివి తెస్తే అనాథ శరణాలయాలకో, వృద్ధాశ్రమాలకు ఇవ్వొచ్చు. లేదంటే బొకేలు, శాలువా ఖరీదును టోకెన్ కింద ఇస్తే అన్న క్యాంటీన్ల ద్వారా ఓ నలుగురు పేద వారికి రూ.5 భోజనం అదించడానికి వినియోగించవచ్చు’’ అని చెప్పారు.