ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు జవాబుదారీ, పారదర్శక పాలన అందించడానికి కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వెల్లడించారు. అందులో భాగంగా గ్రామ సభలను పునరుద్దరించాలని నిర్ణయించుకున్నామని, ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామసభలు(Gram Sabha) నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఈ గ్రామ సభల్లో యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల స్థాయి నుంచే రాష్ట్రం అభివృద్ధి చెందడం మొదలవుతుందని, గ్రామాలు రాష్ట్రానికి పట్టుకొమ్మలాంటివని పేర్కొన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో ఈ అంశంపై పవన్ కల్యాణ్ మాట్లాడారు.
‘‘ప్రతి గ్రామంలో ఆగస్టు 15, జనవరి 26 వంటి ఉత్సవాల నిర్వహణకు కేటాయించే నిధులను పెంచుతాం. ఉపాధి హామీ పథకం ద్వారా 9 కోట్ల పని దినాలు నిర్వహించి 54 లక్షల కుటుంబాలకు ఉపాధి అందించాం. గ్రామ సభలంటే తూతూ మంత్రంగా కాకుండా అంతా కూర్చుని గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించే ప్రాంగణంగి నిర్వహిస్తాం. మన గ్రామాన్ని మనమే పాలించుకునేలా తీర్చిదిద్దాం. వైసీపీ హయాంలో పంచాయతీలన్నీ నిర్వీర్యమయ్యాయి. పంచాయతీలకు వచ్చిన నిధులను వైసీపీ సర్కార్ పక్కదారి పట్టించేసింది. కానీ కూటమి పాలనలో అలా జరగదు. పంచాయతీల ప్రత్యేకతను గుర్తించి సంపద సృష్టించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. కలప కోసం ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చు పెడుతూ డెన్మార్క్ వైపు చూసే కన్నా పంచాయతీల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లోనే కలపను పెంచి పంచాయతీలను అభివృద్ధి బాట పట్టిస్తాం’’ అని వెల్లడించారు Pawan Kalyan.