చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలతో తనకు వ్యక్తిగత వైరమేమీ లేదని.. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏమీ మిగలదని తెలిపారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల జనసేనలో చేరారు. ఆయనతో పాటు చిత్తూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలకు పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాయలసీమ మొత్తం బానిస సంకెళ్లతో నిండిపోయిందని.. జగన్ గ్యాంగ్ నుంచి సీమను రక్షించుకోవాలన్నారు.
నిన్నటి వరకు తనకు సలహాలు ఇచ్చిన వారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అవసరాల మేరకు మాట్లాడే వ్యక్తులు తనకు అవసరం లేదని అన్నారు. సీట్లు ఎన్ని తీసుకోవాలి, రాజకీయాలు ఎలా చేయాలి అనే విషయంపై ఇలాంటి వాళ్ల సలహాలు, సూచనలు తనకు అవసరం లేదని చెప్పారు. ఇకపై కాపు రిజర్వేషన్ల గురించి కానీ, ఇతర అంశాల గురించి కానీ పద్ధతి ప్రకారం మాట్లాడాలని సూచించారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు తమ పార్టీ కార్యాలయాల ఆవరణలోకి వచ్చారని.. ప్రజాస్వామ్యంలో ఇదంతా సాధారణమే అంటే కుదరదని చెప్పారు. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు.