బహుభాషా విధానంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన వైఖరిని వెల్లడించారు. తన వైఖరిలో ఎటువంటి మారపు రాలేదని, గతంలో ఏం చెప్పానో ఇప్పుడూ అదే చెప్తున్నానని అన్నారు. ఒక భాషను బలవంతంగా ప్రజలపై రుద్దడం సరైన పద్దతి కాదని, అదే విధంగా ఒక భాషను వ్యతిరేకించడం కూడా మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. భారతదేశ జాతీయ సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడానికి ఈ రెండు అంశాలు చాలా సహాయపడుతాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగానే తాను ఎప్పుడూ కూడా హిందీని వ్యతిరేకించలేదని, దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించానని వివరించారు.
‘‘జాతీయ విద్యావిధానం-2020 స్వయంగా హిందీని అమలు చేయలేదు. హిందీ భాష అమలు విషయంలో తప్పుడు కథనాలు ప్రచారం అవుతున్నాయి. వాటి ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది. అంతకుమించి ఈ తప్పుడు కథనాల లక్ష్యం మరేమీ లేదు. NEP-2020 ప్రకారం విద్యార్థులు ఒక విదేశీ భాషతో పాటు రెండు భారతీయ భాషలు నేర్చుకునే వీలుంటుంది. హిందీ వద్దని అనుకుంటే విద్యార్థులు తమ మాతృభాషతో పాటు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల భాషలను నేర్చుకోవచ్చు’’ అని ఆయన(Pawan Kalyan) వివరించారు.