Pawan Kalyan has announced one lakh financial assistance to ippatam village victims: ఇప్పటం గ్రామ బాధితులకు తాను అండగా ఉంటానంటూ ఆ గ్రామంలో పర్యటించి.. పవన్ వారికి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా..ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు సిద్ధం అయ్యారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఒక్కో బాధితుడికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు నేడు ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
‘‘మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు, ఆవాసాలు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని పవన్ నిర్ణయించారు. మార్చి 14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి శుక్రవారం జేసీబీలను పెట్టి, పోలీసులను మోహరింపచేసి ఇళ్లు కూల్చేశారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారు. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. నైతిక మద్దతుతోపాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా బాధితులకు అందచేస్తారు.’’అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.