అచ్యుతాపురం ఫార్మా సంస్థలో జరిగిన పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అదే విధంగా ఈ ప్రమాదంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రమాదం మానవ తప్పిదమా లేకుంటే యాదృచ్చిక ప్రమాదమా అనేది తేల్చాలని ఆదేశించారు. ఒకవేళ ఇది మానవ తప్పిదమే అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇప్పటి వరకు తన అందిన సమాచారాన్ని బట్టి చూస్తే ఈ ప్రమాదానికి సంస్థ యాజమాన్య నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
‘‘కాలుష్య నియంత్రణ శాఖ నా పరిధిలోనే ఉన్నా భద్రత వేరే శాఖ కిందకు వస్తుంది. పరిశ్రమల్లో భద్రత ఆడిట్ నిర్వహించాలని అనేక సార్లు చెప్పాం. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం భద్రత ఆడిట్ చేయించాలి. సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం, అందులో అమాయకులైన కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన అంశం. సంతాపం తెలపడం, పరిహారం చెల్లించడంతో సమస్య సమసిపోదు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తాం’’ అని Pawan Kalyan వెల్లడించారు.