పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చేబ్రోలులోని ఆయన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మ, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం గత ఐదు ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ. 114.76 కోట్లుగా ఉంది. తన సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47.7కోట్లు, జీఎస్టీ రూపంలో మరో రూ.28.85కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే రూ.64.26 కోట్లు అప్పులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17.56 కోట్లు అప్పుగా తీసుకోగా.. ఇతర వ్యక్తుల నుంచి రూ.46.70కోట్లు తీసుకున్నట్లు వివరించారు.
ఇక వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17.15కోట్లు ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాదబీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు రూ.3.32కోట్లు విరాళాలు అందచేశారు.
ఆ వివరాలు..
కేంద్రీయ సైనిక్ బోర్డు- రూ.1 కోటి
పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్- రూ.1 కోటి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి- రూ.50 లక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి- రూ.50 లక్షలు
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్- రూ.30,11,717
పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్- రూ.2 లక్షలు