పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతాపురం ఘోరాన్ని మరువక ముందే మరో ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. సంస్థ యాజమాన్యాల నిర్లక్ష్యానికి పెట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చి పనులు చేసుకుంటున్న కూలీలు బలి కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రోజుల వ్యవధిలో రెండు ఫార్మా సంస్థల్లో జరిగిన ప్రమాదాలు సదరు సంస్థల యాజమాన్యాలు, అధికారుల అలసత్వానికి అద్దం పడుతున్నాయంటూ మండిపడ్డారు.
‘‘జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్డేడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి వేళ సంభవించిన ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిసి చాలా బాధ కలిగింది. పొట్టకూటి కోసం ఝార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికులలో నలుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండడం విషాదకరం. ప్రమాదకరమైన రసాయనాలతో ఉత్పత్తులను తయారుచేసే ఫార్మా కంపెనీలలోనే ప్రమాదాలు తరచూ జరగడం యాజమాన్యాలు, సంబంధిత అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. క్షతగాత్రులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది’’ అని Pawan Kalyan హామీ ఇచ్చారు.