ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar) సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ సంఘటనలో బాలుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి, పొగ పీల్చి అస్వస్థతకు గురయ్యాడు. సింగపూర్ వార్తా నివేదికల ప్రకారం… మార్క్ శంకర్ ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్(Pawan Kalyan) కి ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు ఆయనకి సూచించారు. ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాను’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.